సినీ స్టార్లకేంటి?వారి జీవితాలు వడ్డించిన విస్తరిలా ఉంటాయి. ఒత్తిళ్లు, భయాలు, బెంగలు ఏవీ ఉండవు.. ఇలా అనుకునేవారు చాలా మంది! కానీ, వారూ మనలాగే సాధారణ జీవితం గడిపిన వారే. కానీ అక్కడి నుంచి స్టార్లుగా ఎదిగారు. ఈ క్రమంలో వారెన్నో కష్టాలూ, కన్నీళ్లూ చవిచూశారు. అందుకే ‘ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొన్నాం, డిప్రెషన్ నుంచి మాత్రం బయటపడలేకపోయాం’ అంటూ చాలామంది తమ అనుభవాలను బయటపెట్టారు. ఇప్పటికే దీపిక పదుకొణె, అనుష్క శర్మ, ఇలియానా తదితరులు తాము కుంగుబాటుతో బాధపడ్డామని చెప్పుకొన్నారు. దాని నుంచి బయటపడ్డామనీ పేర్కొన్నారు. అయితే వీరు తమ అనుభవాలను బయటపెట్టడం వల్ల ఎందరో సాధారణ ప్రజలు కూడా వారి నుంచి స్ఫూర్తి పొంది తమ సమస్యల నుంచి బయటపడేందుకు యత్నిస్తున్నారని పలు నివేదికలు పేర్కొన్నాయి.
నాలుగేళ్ల క్రితం తాను తీవ్ర నిరాశతో చాలా బాధపడ్డానని చెప్పి అభిమానులను షాక్‌కు గురి చేశారు దీపిక. వృత్తిపరంగా సక్సెస్ అయినప్పటికీ తాను రోజూ ఏడ్చేదాన్నని పేర్కొన్నారు. ఇందుకు కారణం మాజీ ప్రియుడు రణ్‌బీర్ కపూరేనని పరోక్షంగా వెల్లడించారు. తన తల్లి, తనకు చికిత్స అందించిన వైద్యురాలి వల్ల కోలుకున్నానని చెప్పారు. అంతేకాదు.. తనలా డిప్రెషన్‌తో బాధపడుతున్నవారు లోలోపల కుమిలిపోకుండా చికిత్స తీసుకోవాలని, వైద్యులను సంప్రదించాలన్న ఉద్దేశంతో ‘లివ్, లవ్, లాఫ్’ పేరిట ఫౌండేషన్‌ను కూడా స్థాపించారు. బహుశా డిప్రెషన్ గురించి మొదటిసారి బయటపెట్టిన నటి దీపికే కావచ్చు.
ఆమె తర్వాత అనుష్క శర్మ, ఇలియానా కూడా తమ మానసిక సమస్యల గురించి మీడియా ద్వారా వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో తాను తీవ్ర ఉద్విగ్నతకి గురయ్యేదాన్నని అనుష్క వెల్లడించారు. ఇందుకోసం చికిత్స తీసుకున్నానని, రోజూ చికిత్స తీసుకోవడం వల్ల కోలుకుంటున్నానని పేర్కొన్నారు. ఇది అందరికీ ఎదురయ్యే సమస్యే కాబట్టి నిర్మొహమాటంగా బయటపెడుతున్నానని చెప్పారు. అనుష్క కుటుంబీకుల్లో కొందరు డిప్రెషన్‌తో బాధపడేవారట. దీని గురించి ధైర్యంగా నలుగురికీ చెప్పుకొంటేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అభిమానులకు సూచించారు.
ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన గోవా బ్యూటీ ఇలియానా కూడా మానసిక వేదనతో తల్లడిల్లిపోయారు. ‘దేవదాస్’లో ఆమె శరీరాకృతికి అందరూ ఫిదా అయ్యారు. కానీ అదే ఆకృతి విషయంలో తానెంతో మానసిక వేదనను ఎదుర్కొన్నారు. బాడీ డిస్మోర్ఫిక్ డిజార్డర్‌తో, డిప్రెషన్‌తో బాధపడ్డారు. ‘చాలా మంది నా శరీరాకృతి గురించే మాట్లాడుకునేవారు. నాకు 15 ఏళ్ల వయసు రాగానే అందరూ నన్ను నాలా స్వీకరించాలని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను సినిమాల్లోకి అడుగుపెట్టానో నా సమస్య మరింత ఎక్కువైంది. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చాయి. కానీ ఇలా అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకోవడం సరికాదనిపించింది. బాగా తినడం, వ్యాయామం చేయడం మొదలుపెట్టాను. మీరు నన్ను వెండితెరపై చూసి మురిసిపోవడం వేరు. నేను నా శరీరాకృతి వల్ల నా జీవితంలో పడుతున్న బాధలు వేరు. అన్నీ పర్‌ఫెక్ట్‌గా ఉంటే అది జీవితం ఎందుకు అవుతుంది?’ అని ఒకానొక సందర్భంలో ఇలియానా వెల్లడించారు. అయితే జీవితంలోకి తన ప్రియుడు ఆండ్రూ నీబోన్ రావడంతో అన్నీ సర్దుకున్నాయని చెప్పారు. ఇప్పుడు చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నానని పేర్కొన్నారు.
ఇలా ఒక్కొక్కరు బయటికి వచ్చి తాము ఎదుర్కొన్న మానసిక సమస్యలను బయట చెప్పుకొన్నారు. అయితే వీరు ఇలా చెప్పుకోవడం వల్ల సమాజంలో ఏమైనా మార్పు వచ్చిందా? అంటే ‘ఉంది’ అనే అంటున్నారు మానసిక నిపుణులు. ‘ఈ రోజుల్లో సైకాలజిస్ట్ వద్దకు వెళ్లాను అని చెప్పడానికి మొహమాటపడుతూ.. కార్డియాలజిస్ట్ వద్దకు వెళ్లానని ధైర్యంగా చెప్పుకొంటున్న వారున్నారు. సైక్రియాట్రిస్టులు ఇచ్చే మందులు వేసుకోరు కానీ మరో వైద్యుడు ఇస్తే మాత్రం వేసుకుంటారు. నా వద్దకు మానసిక సమస్యలు ఉన్న పేషెంట్లు వస్తే దీపిక పదుకొణెలాంటి వారి గురించి చెప్పి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంటాను. వారు కూడా ఇలాంటి పరిస్థితుల నుంచే బయటపడ్డారని చెప్తుంటాను. దాంతో వారు భయపడకుండా తమ సమస్యలను చెప్పుకొంటూ ఉంటారు. ఇలా సెలబ్రిటీలు తమ సమస్యలు చెప్పడం వల్ల సాధారణ ప్రజల్లోనూ మార్పు వస్తోంది. ఆత్మహత్యలకు పాల్పడకుండా సాయం కోసం మా వద్దకు వస్తున్నారు’ అంటూ ఇటీవల ఒకరిద్దరు మానసిక నిపుణులు తెలిపారు.