వడ్డీ లేని రుణాలు.. ప్రీమియం కట్టకుండానే పంటల బీమా

0
56

5 నాఫెడ్‌ కేంద్రాల ద్వారా కొబ్బరి కొనుగోళ్లు
మార్కెట్‌ కమిటీలకు గౌరవ ఛైర్మన్లుగా ఎమ్మెల్యేలు
జమ్మలమడుగు బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రకటన
సెప్టెంబరు 1 నుంచి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే సంక్షేమ పథకాలు

 

రైతు భరోసా పథకం కింద కౌలు రైతులు సహా దాదాపు 70 లక్షల రైతు కుటుంబాలకు ఏటా రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తాం. అక్టోబరు 15న దీన్ని ప్రారంభిస్తాం.రైతు భరోసాకు మా ప్రభుత్వం రూ.8,750 కోట్లు వెచ్చించనుంది. ఒకే విడతలో అన్నదాతలకు ఇంత భారీ మొత్తం నిధులను దేశంలో ఏ ప్రభుత్వమూ అందించలేదు.

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞాన్ని తలపెట్టారు. ఆ పనులను పరుగులు పెట్టించి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. గోదావరి జలాలను నాగార్జునసాగర్‌, శ్రీశైలం రిజర్వాయర్‌లకు తరలించడం ద్వారా కృష్ణా నది ఆయకట్టును స్థిరీకరిస్తాం. దీంతో రాయలసీమ, ప్రకాశం జిల్లాల ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలు తీరతాయి. రాజోలి జలాశయం పనులు డిసెంబరులో చేపడతాం.

– ముఖ్యమంత్రి జగన్‌

 

మది రైతు శ్రేయో ప్రభుత్వమని, అన్నదాత బాగుండాలన్నదే సర్కారు లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. వైఎస్సార్‌ జయంతిని రైతు దినోత్సవంగా ఏటా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినందున రైతుల పట్ల తమ బాధ్యత మరింత పెరగనుందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్‌ కమిటీలకు ఎమ్మెల్యేలను గౌరవ ఛైర్మన్లుగా నియమిస్తామని ప్రకటించారు. దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకొని కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన రైతు దినోత్సవ బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ అన్నదాతలపై వరాల జల్లు కురిపించారు. ‘రైతులకు రూ.84 వేల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వారు తీసుకున్న రుణాలను గడువులోగా చెల్లిస్తే వడ్డీ కట్టక్కర్లేదు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు సక్రమంగా విద్యుత్తు అందలేదు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే 60 శాతం ఫీడర్లకు పూర్తిగా కరెంటు అందుతోంది. మిగతా 40 శాతం ఫీడర్లకు విద్యుత్తు అందించడానికి రూ.17 వేల కోట్లు మంజూరు చేశాం. పాదయాత్రలో ఆక్వా రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్తును అందజేస్తాం. పంటల బీమా కోసం రాష్ట్రవ్యాప్తంగా 55 లక్షల మంది రైతుల తరఫున 56 లక్షల హెక్టార్లకు రూ.2163.50 కోట్ల బీమా ప్రీమియం చెల్లింపునకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 1.10 లక్షల మంది పామాయిల్‌ రైతులకు లబ్ధి చేకూర్చేందుకు తెలంగాణతో సమానంగా రైతులకు రూ.80 కోట్లతో మద్దతు ధర కల్పిస్తాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మలమడుగులో శనగ రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం వారిని ఆదుకునేందుకు క్వింటాలుకు రూ.1,500 నగదు రాయితీ ప్రకటించాం. ఇందుకోసం సుమారు రూ.330 కోట్లు మంజూరు చేయడానికి నిశ్చయించాం. విత్తన కొనుగోలులో గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మిగిలిన బకాయిలకు రూ.384 కోట్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 3,57,000 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు పంపిణీ చేశాం. గత ప్రభుత్వం 2018-19కి సంబంధించి ఇవ్వాల్సిన రూ.2 వేల కోట్ల ఇన్‌పుట్‌ రాయితీని ఇచ్చేందుకు నిర్ణయించాం. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణలో గత ప్రభుత్వం మిగిల్చిన రూ.960 కోట్ల బకాయిలు చెల్లిస్తాం. ఇప్పటికే రూ.360 కోట్లు విడుదల చేశాం. ప్రమాదవశాత్తు మరణించిన, ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాలకు అక్కడి శాసనసభ్యుడు, కలెక్టర్‌ కలిసి వారి ఇంటికే వెళ్లి రూ.7 లక్షల బీమా అందజేస్తారు. నాఫెడ్‌ ఏర్పాటు చేసిన 5 కొనుగోలు కేంద్రాల ద్వారా కొబ్బరికి కనీస మద్దతు ధర కల్పిస్తాం.

 

ప్రతి అవ్వా తాతకు పింఛను
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక వృద్ధులకు పింఛన్ల పెంపుపైనే తొలి సంతకం చేశాను. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే వృద్ధులకు ఇచ్చే పింఛన్లను రూ.2,250కి పెంచాం. వైకల్య శాతంతో సంబంధం లేకుండా దివ్యాంగులందరికీ రూ.3000 పింఛను ఇచ్చేందుకు శ్రీకారం చుట్టాం. పింఛన్లకు అర్హులుగా ఉండి మిగిలిపోయిన వారందరికీ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటాం. కుల, మత, ప్రాంతం, వర్గం, పార్టీలకతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమిస్తున్నాం. సెప్టెంబరు 1 నుంచి వారు లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పథకాల లబ్ధిని అందిస్తారు. గ్రామ వాలంటీర్లు తప్పు చేస్తే విధుల్లో నుంచి తొలగిస్తాం. వీరిపై ఫిర్యాదులకు ఓ ఫోన్‌ నంబరును కూడా పెడుతున్నాం. దోపిడీ లేని ఇసుక విధానాన్ని తీసుకువస్తున్నాం’ అని జగన్‌ చెప్పారు.

 

రూ.2వేల కోట్లతో విపత్తుల సహాయనిధి
రాబోయే సంవత్సర కాలంలో కర్షకుల సంక్షేమం కోసం చేపట్టనున్న కార్యక్రమాలను ముఖ్యమంత్రి వివరించారు. రైతుల కోసం రూ.2 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధిని, గిట్టుబాటు ధర కల్పించడానికి రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు రబీలో పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. భూయజమానులు, కౌలు రైతులకు నష్టం జరగకుండా కౌలు రైతుల చట్టాన్ని సవరిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, అవసరమైన మేరకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి గ్రామంలోనూ నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. అవసరాన్ని బట్టి జిల్లాల్లో కోల్డ్‌స్టోరేజీలు, ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పుతామని ప్రకటించారు.

 

అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం
సోమవారం ఉదయం 8.30 గంటలకు ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు పలువురు నేతలు, అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 9గంటలకు కుటుంబ సమేతంగా ఇడుపులపాయకు చేరుకున్న జగన్‌.. వైఎస్సార్‌ జయంతి సందర్భంగా వైఎస్సార్‌ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 10 గంటలకు బయలుదేరి ఇడుపులపాయలోని తన నివాసం చేరుకుని అరగంటసేపు కుటుంబసభ్యులతో గడిపారు. అక్కడి నుంచి గండి క్షేత్రానికి చేరుకుని స్వామి దర్శనానంతరం ఆలయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పులివెందులలో అరటి పరిశోధన కేంద్రానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మధ్యాహ్నం 12.05 గంటలకు జమ్మలమడుగు రైతు దినోత్సవం బహిరంగ సభ వద్దకు చేరుకున్నారు. సభా ప్రాంగణంలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. మధ్యాహ్నం 1.08కి వేదికపైకి చేరుకుని వైఎస్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం సీఎం ప్రసంగిస్తూ కడపకు సంబంధించి చెన్నూరు చక్కెర కర్మాగారం పునరుద్ధరణ సహా పలు హామీలిచ్చారు. డిసెంబరులో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేస్తామన్నారు. వివిధ పథకాల లబ్ధిదారులకు చెక్కులు అందించారు. ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.