జట్టుగా ఆడటంలో విఫలమయ్యాం
మాంచెస్టర్: ప్రపంచకప్ నుంచి నిష్క్రమించడంపై భారత ఓపెనర్ రోహిత్‌శర్మ తొలిసారి స్పందించాడు. గురువారం రాత్రి ట్విటర్ వేదికగా భావోద్వేగపూరిత పోస్టు పెట్టి తన బాధను అభిమానులతో పంచుకున్నాడు. ‘అవసరమైనప్పుడు జట్టుగా ఆడటంలో మేం విఫలమయ్యాం. అరగంట పేలవ ఆటతీరు ప్రపంచకప్ అవకాశాన్ని కోల్పోయేలా చేసింది. ప్రస్తుతం నేను చాలా బాధలో ఉన్నా. నాలాగే మీరు కూడా బరువైన హృదయాలతో ఉన్నారని తెలుసు. ఇంగ్లాండ్ గడ్డపై భారత అభిమానుల నుంచి వచ్చిన స్పందన అమోఘం. టీమిండియా ఆడిన ప్రతీచోట ఇంగ్లాండ్‌ను నీలంరంగులో మార్చినందుకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన తొలినాకౌట్‌లో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. రోహిత్‌శర్మ, కేఎల్ రాహుల్, విరాట్‌కోహ్లీ ముగ్గురూ ఒక్క పరుగుకే వెనుతిరగడంతో టీమిండియా గెలుపు అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. అనంతరం రవీంద్ర జడేజా(77), ధోనీ(50) పోరాడినా భారత జట్టుకు ఓటమి తప్పలేదు. కాగా రోహిత్ ఈ టోర్నీలో ఇప్పటివరకూ అత్యధిక పరుగులు (648) చేసిన ఆటగాడిగా నిలిచాడు.