అమరావతి: శాసనసభ సమావేశాల వ్యూహం అమలుపై చర్చించేందుకు కొందరు మంత్రులు రాకపోవడంపై ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ‘రాని మంత్రులెవరెవరు? జాబితా సిద్ధం చేయండి. వారి పరిస్థితేంటో మాట్లాడదాం’ అని చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి తదితరుల్ని ఆయన్ని ఆదేశించారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు… ఈ సమావేశం ప్రారంభంలో మంత్రులు లేకపోవడంపై జగన్ అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వ వాదనను బలంగా వినిపించడంతోపాటు తెదేపా అవకతవకలపై సరైన ఆధారాలతో సభలో మాట్లాడేందుకు 30 మందితో నియమించిన వ్యూహ కమిటీ (స్ట్రాటజీ కమిటీ) కసరత్తుపై ఆయన సమీక్షించారు. ‘బడ్జెట్‌పై మాట్లాడే పరిస్థితి లేక చర్చను బడ్జెట్ నుంచి వేరే అంశాలపై మళ్లించేందుకు ప్రతిపక్ష తెదేపా ప్రతిరోజూ సభలో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వారి పన్నాగంలో పడకుండా బడ్జెట్‌పైనే చర్చ సాగిద్దాం’ అని జగన్ స్పష్టంచేశారు. శాసనమండలిలోనూ దీటుగా స్పందించాలని సూచించారు.
ఇసుకపై చర్చించి నిర్ణయిద్దాం
ఇసుక విషయంలో క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు వైకాపా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కలెక్టర్ల అనుమతి ప్రక్రియ సమస్యలకు తావిస్తోందని, నూతన విధానం వచ్చేలోగా సమస్యకు తాత్కాలిక పరిష్కారం అవసరమని వారు అభిప్రాయపడ్డారు. చర్చించి ఒక నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి వారికి చెప్పినట్లు సమాచారం. సమావేశంలో వివిధ అంశాలు చర్చకొచ్చాయి. తెదేపా ప్రభుత్వ హయాంలో కీలక శాఖలో కార్యదర్శిగా పనిచేసిన అధికారి ఇప్పుడు కూడా తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఒక మంత్రి, కొందరు ఎమ్మెల్యేలు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాన్ని ఆ అధికారి తప్పుల తడకగా పంపారని, తెదేపా హయాంలో ఎలాంటి లోపాలు లేవన్నట్లుగా ఆ సమాధానం ఉందని చెప్పారు. అలాంటి వారిని కీలక స్థానాల్లో కొనసాగించడం సరికాదన్న భావనను పలువురు ఎమ్మెల్యేలు వ్యక్తపరిచారు. ‘అలాంటి అధికారులు ఇచ్చే సమాచారాన్ని మీరు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. అవసరమైతే నాకు పంపండి. నేనూ చెక్ చేస్తా. వారిచ్చిన సమాచారంతోనే సభకు వెళ్లి ఇబ్బందుల్లో పడవద్దు’ అని ముఖ్యమంత్రి వారికి సూచించారు. బుధవారం ప్రశ్నోత్తరాల్లో రానున్న ఒక్కో ప్రశ్న వారీగా సమగ్రంగా చర్చించారు. సమావేశానంతరం మంత్రి చెరుకువాడ రంగనాధ రాజు విలేకరులతో మాట్లాడుతూ- తెదేపా ప్రభుత్వం కాపులకు అన్యాయం చేసిందని, ఏటా రూ.వెయ్యి కోట్ల చొప్పున కాపుల సంక్షేమానికి కేటాయిస్తామన్న చంద్రబాబు అవీ ఇవ్వలేదని విమర్శించారు.