పవిత్ర యాత్రలో గొప్ప సేవ చేస్తున్న సిద్ధిపేట వాసులు…

0
40

గడ్డకట్టుకుపోయే చలి.. వేల కిలోమీటర్ల ప్రయాణం.. ఎన్నో ఒడుదొడుకులు.. ప్రయాసలకోర్చి ప్రయాణం.. కడుపు నిండా తిందామంటే రుచికరమైన తెలుగు భోజనం దొరకని పరిస్థితి.. ఇదీ అమరనాథ్‌ యాత్రకు వెళ్లే భక్తుల పరిస్థితి. ఇలాంటి వారి కోసం అమర్‌నాథ్‌లో ఓ తెలుగు భోజనశాల ఏర్పాటు చేశారు. ఎవరు చేశారు… ఎక్కడ తదితర విషయాలు మీకోసం…

అమర్‌నాథ్‌ యాత్ర కష్టాలను స్వయంగా అనుభవించిన కొందరు యాత్రికులు తాము పడ్డ ఇబ్బందులు ఇంకెవరూ పడకూడదని అనుకున్నారు. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే ‘అమర్‌నాథ్‌ అన్నదాన సేవా సమితి’. వేల కిలోమీటర్ల ప్రయాణంలో మధ్య మధ్యలో కొన్ని ఉత్తరాది భోజనశాలలు ఉన్నా.. తెలుగువాళ్లు తృప్తిగా కడుపునిండా తినలేని పరిస్థితి.  అలాంటివారి కోసమే ఈ సేవాసమితి భోజన కేంద్రాలను ఏర్పాటు చేసింది.

ఇదీ నేపథ్యం: సిద్ధిపేట నుంచి 2010లో 45 కుటుంబాలు అమర్‌నాథ్‌యాత్రకు వెళ్లాయి. వాతావరణం అనుకూలించక వారం రోజుల పాటు బేస్‌క్యాంపుల్లోనే గడిపారు. అక్కడ ఉచితంగా భోజనం అందించే ఉత్తర భారతదేశానికి చెందిన వివిధ ధార్మిక సేవా కేంద్రాలున్నాయి. ఆయా ప్రాంతాలకు చెందిన ఆహారపదార్ధాలు మాత్రమే లభించే పరిస్థితి. దీంతో అమర్‌నాథ్‌ యాత్రికులకు తెలుగు రుచులు అందించాలని అమర్‌నాథ్‌ అన్నదాన సేవా సమితి ఏర్పాటు చేశారు. 2011లో 21 మందితో ఏర్పాటైన ఈ సమితిలో ప్రస్తుతం వందమందికిపైగా  సభ్యులు ఉన్నారు. కొందరు దాతల సాయంతో ఏటా వేలాది మంది భక్తుల ఆకలిని తీరుస్తున్నారు.

భోజనం ఇలా..: ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు నిర్విరామంగా భోజన కార్యక్రమం సాగుతుంది. ఉదయం పాలు, టీతో పాటు ఉతప్పం, దోశ, ఉప్మా, పూరీ వంటి అల్పాహారాలు ఉంటాయి. మధ్యాహ్నం ఆవకాయ పచ్చడి, పప్పుతో పాటు రుచికరమైన కూరలు, అప్పడం, మిఠాయి, పెరుగుతో పసందైన భోజనం పెడతారు.

నిర్వహణ ఇలా: భోజనశాల నిర్వహణ కోసం సభ్యులు బృందాలుగా ఏర్పడ్డారు. ఒక్కో బృందం 10 నుంచి 12 రోజుల వరకు సేవలు అందిస్తుంటారు. మరికొందరు తమ వీలును బట్టి యాత్ర ముగిసేవరకు అక్కడే ఉండి సేవలు నిర్వహిస్తుంటారు. యాత్రకు వచ్చిన కొందరు భక్తులు సైతం వీరికి తోడుగా నిలుస్తున్నారు. బల్తాల్‌ బేస్ క్యాంపులో మొదట ప్రారంభించి వీరి సేవలు నిర్విరామంగా కొనసాగిస్తున్నారు.  యాత్రకు మరో మార్గం అయిన పహల్గావ్ దారిలోని  పంచతరణి వద్ద 2013లో మరో అన్నదాన సేవా కేంద్రాన్ని ప్రారంభించారు.  బల్తాల్‌ క్యాంపులోని ఎనిమిదో నెంబరు లంగరులో, పంచతరణి వద్ద ఉన్న రెండో నెంబరు లంగరులో తెలుగు రుచులను అందిస్తున్నారు.