అమరావతి: ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం శాసనసభ వాడివేడిగా ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛను విషయంలో తలెత్తిన ప్రశ్న కారణంగా ముగ్గురు తెదేపా ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ప్రశ్నోత్తరాల సమయంలో వైకాపా ఎన్నికల హామీపై స్పష్టతకు తెదేపా సభ్యుడు రామానాయుడు డిమాండ్ చేశారు. అయితే అలాంటి హామీ ఇవ్వలేదని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో తాను మాట్లాడిన వీడియోను సభలో ప్రదర్శించారు. ఎస్పీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రయోజం కల్పించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.
దీనిపై స్పందించిన తెదేపా సభ్యులు తమ వద్ద ఉన్న వీడియోను ప్రదర్శించేందుకు అనుమతి కోరారు. దీనికి ప్రభుత్వం నిరాకరించడంతో స్పీకర్ తదుపరి ప్రశ్నకు వెళ్లారు. దీంతో తెదేపా సభ్యులు ఆందోళనకు దిగారు. ఆగ్రహించిన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. ఈ సమావేశాలు ముగిసేవరకు తెదేపా సభ్యులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చయ్య చౌదరిలను సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు ప్రతిపాదించారు. స్పీకర్ స్థానంలో ఉన్న ఉపసభాపతి కోన రఘుపతి దీనిని ఆమోదించారు. అయినప్పటికీ తెదేపా సభ్యులు సభను వీడలేదు. అక్కడే ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్యే సభ కొనసాగుతోంది.