దిల్లీ: వెస్టిండీస్ పర్యటనకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన టీమిండియా జట్లపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇవ్వకపోవడం, అజింక్య రహానెను టెస్టులకు మాత్రమే పరిమితం చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు. సెలక్షన్ కమిటీ మొత్తం మూడు ఫార్మాట్‌ల్లో ఒకే ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని, అందరినీ సంతోషపరచడానికీ జట్టుని ఎంపిక చేయరాదని తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నాడు.
‘అన్ని ఫార్మాట్‌లకు ఒకే ఆటగాళ్లను ఎంపిక చేసే సమయం సెలక్షన్ కమిటీకి ఆసన్నమైంది. దీని వల్ల ఆటగాళ్లు మరింత విశ్వాసంతో రాణిస్తారు. కేవలం కొంతమంది ఆటగాళ్లు మాత్రమే మూడు ఫార్మాట్‌ల్లో ఆడుతున్నారు. గొప్ప జట్లలో ఆటగాళ్లు స్థిరంగా ఉంటారు. అందర్నీ సంతోషపరచడానికి జట్టును ఎంపిక చేయకూడదు. దేశానికి ఉత్తమ జట్టుని అందివ్వాలి.’ అని బీసీసీఐని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు.
విండీస్ పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో అంజిక్య రహానెను టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. వెస్టిండీస్-ఎతో జరిగిన సిరీస్‌లో అద్భుతంగా రాణించిన శుభ్‌మన్ గిల్‌కు జట్టులో స్థానం దక్కకపోవడంతో బీసీసీఐపై అభిమానులు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారు. ఈ సిరీస్‌లో గిల్ మూడు అర్ధశతకాలతో 218 పరుగులు బాదాడు. ఆగస్టు 3 నుంచి వెస్టిండీస్ సిరీస్ ప్రారంభం కానుంది.