విందు భోజనాలు పెట్టిన రైతుకు రూ.4 కోట్ల బహుమానం

0
57

విందు భోజనం పెట్టిన ఓ సామాన్యుడికి చదివింపుల రూపేణా ఏకంగా రూ.4 కోట్లు సమకూరాయి. ఐదు వేలమంది వరకు అతిథులు వచ్చి ఆయన్ని అలా ఆశీర్వదించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు విందు భోజనం ఏర్పాటు చేయడం.. బంధుమిత్రులు వచ్చి ఆ విందు ఆరగించి స్థోమతను బట్టి చదివింపుల కింద ఆర్థిక సాయం అందించే సంప్రదాయం తమిళనాడు పుదుక్కోట జిల్లా కీరామంగళం తాలూకాలోని వడగాడు, పరిసర గ్రామాల్లో ఉంది. పేద, మధ్యతరగతి వర్గాలను ఆదుకోవడం కోసం తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇలా వడగాడు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి గురువారం తన బంధుమిత్రులు, గ్రామస్థులకు విందు ఏర్పాటుచేశాడు. సుమారు 50,000 ఆహ్వాన పత్రికలను ముద్రించి పంచారు. 1000 కిలోల మేక మాంసాన్ని సమకూర్చుకున్నారు. రూ.15 లక్షలు ఖర్చుపెట్టాడు. అయితే అతిథులు ఇచ్చిన చదివింపులు ఆయన్ని ఏకంగా కోటీశ్వరుణ్ని చేశాయి! డబ్బులు లెక్కించడానికి లెక్కింపు యంత్రాలు అవసరమయ్యాయి. బ్యాంకు ఉద్యోగుల సేవలనూ ఉపయోగించుకున్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేయాల్సి రావడం విశేషం. మొత్తానికి  ఒక్కవిందుతో కృష్ణమూర్తి కుబేరుడయ్యాడు.

   – చెన్నై, న్యూస్‌టుడే