హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేశ్‌గౌడ్ (60) కన్నుమూశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం ఆదివారం రాత్రి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనన్ను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్సపొందుతూ సోమవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియలు ఓ వైపు జరుగుతుండగానే.. ముఖేశ్ గౌడ్ కన్నుమూయడంతో కాంగ్రెస్ పార్టీలో విషాదం నెలకొంది. రెండు రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ ఇద్దరు సీనియర్ నేతలను కోల్పోవడం ఆ పార్టీకి తీరనిలోటుగా మారింది. 1959 జులై 1న జన్మించిన ముఖేశ్‌గౌడ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో రెండు సార్లు మంత్రిగా సేవలందించారు.
కార్పొరేటర్ నుంచి మంత్రి దాకా..
ఓయూ నుంచి బీఏలో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న ముఖేశ్.. కార్పొరేటర్ స్థాయి నుంచి మంత్రి దాకా అంచెలంచెలుగా ఎదిగారు. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కొనసాగారు. విద్యార్థి దశలో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్‌ఎస్‌యూఐలో పనిచేసిన ఆయన అనంతరం యువజన కాంగ్రెస్‌లో క్రియాశీలక పాత్ర పోషించారు. 1986లో జాంబాగ్ నుంచి కార్పొరేటర్‌గా విజయంసాధించారు. 1989, 2004లో మహారాజ్‌గంజ్, 2009లో గోషామహల్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2007లో వైఎస్ హయాంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. 2009లో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో మార్కెటింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలను అయిదేళ్ల పాటు నిర్వర్తించారు. 2014, 2018లలో గోషామహల్ నుంచి పోటీ చేసి భాజపా అభ్యర్థి రాజాసింగ్ చేతిలో ఓటమిపాలయ్యారు. ముఖేశ్ గౌడ్‌కు భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు విక్రమ్‌గౌడ్, విశాల్ గౌడ్, ఒక కుమార్తె శిల్ప ఉన్నారు.