ముఖాన్ని మృదువుగా చేసే ఫేస్‌ మాస్క్‌లు 

0
101

ముఖాన్ని మృదువుగా చేసే ఫేస్‌ మాస్క్‌లు  వేసుకోవాలనుకుంటే కొనాల్సిన పనిలేదు. అందుబాటులో ఉండే కొన్ని రకాల పండ్లతోనూ   తయారు చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు ఉండటంతో పాటు రసాయనాల కారణంగా వచ్చే దుష్ప్రభావాలూ ఎదురుకావు.

* ఒక అరటిపండు, రెండు చెంచాల తేనె, కొన్ని చుక్కల ద్రాక్ష గింజల నూనె.. కలిపి   ముద్దలా చేసుకొని ముఖానికి, మెడకు రాసుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత కడగాలి. ద్రాక్ష గింజల నూనె… చర్మంలో అధిక జిడ్డు పేరుకోకుండా చేస్తుంది. ఇది దొరకని పక్షంలో వేరే ఏ నూనె అయినా కొన్ని చుక్కలు వాడొచ్చు. రసాయనాలతో చేసే సౌందర్య లేపనాలు చర్మాన్ని పొడిగా చేస్తాయి. ఈ లేపనం చర్మం తేమను కోల్పోకుండా, మెరిసేలా చేస్తుంది. మేకప్‌ వేసుకోవడానికి గంట ముందు ఈ మాస్క్‌ వేసుకుంటే ఫౌండేషన్‌ ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది.
* అర కప్పు గుమ్మడి కాయ ముక్కల గుజ్జు, ఒక చెంచా యాపిల్‌సిడార్‌  వెనిగర్‌, రెండు చెంచాల చొప్పున తేనె, పెరుగు తీసుకోవాలి. అన్నింటినీ కలిపి ముఖానికి, మెడకు మాస్క్‌లా వేసుకొని ఇరవై నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. గుమ్మడి  కాయలో ఉండే రెటినాయిక్‌ యాసిడ్‌, యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరొటిన్‌ చర్మాన్ని తాజాగా ఉంచుతాయి. ఆరోగ్యంగానూ మారుస్తాయి.
* పావుకప్పు బొప్పాయి గుజ్జు, ఒక నిమ్మకాయ నుంచి తీసిన రసం, రెండు చెంచాల తేనె, ఒక చెంచా గంధం పొడి కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకొని అరగంట తరువాత చల్లని నీటితో కడగాలి. బొప్పాయిలో ఉండే పొటాషియం, నిమ్మ, తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతిమంతంగా, మృదువుగా చేస్తాయి. గంధం చర్మాన్ని చల్లబరుస్తుంది.