షకిబ్ ఆల్‌రౌండ్ ప్రతాపం చూపించాడు. ముస్తాఫిజుర్ మెరుపు వేగంతో బంతులు విసిరాడు. ముష్ఫికర్ వికెట్ల వెనుక నిల్చొని గట్టిగా అరిచాడు. లిటన్ దాస్ మిడిలార్డర్‌లో మెరిశాడు. ఆఖరికి రహస్య అస్త్రం సైపుద్దీన్ కూడా రెచ్చిపోయాడు. అయినా బంగ్లా పులి గాండ్రించలేకపోయింది. ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లో సఫారీలను వణికించారు. మధ్యలో విండీస్ వీరులపైనా వీరవిహారం చేశారు. పనిలో పనిగా టీమిండియానూ కాస్త భయపెట్టారు. ఆఖర్లో అఫ్గన్లపైనా తమ సత్తా చాటారు. అయినా బంగ్లా పులి గాండ్రించలేకపోయింది. ఆసియా జట్లతో కలిసి ఆరోసారి ప్రపంచకప్‌కు టికెట్ బుక్ చేసుకున్న బంగ్లాదేశ్ సెమీస్ బెర్తు ఖాయం చేసుకోలేక లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది.
బంగ్లాదేశ్ ప్రపంచకప్ ఆశలకు ఈ టోర్నీలోనూ సమాధానం దొరకలేదు. ఇప్పటికే ఆసియా దేశాలైన భారత్, పాకిస్థాన్, శ్రీలంక ఈ మెగా టైటిల్‌ను ముద్దాడగా, బంగ్లా ఇంకా పోరాడుతూనే ఉంది. భారత్ మూడో టోర్నీ (1983)లో, ఐదో టోర్నీలో పాక్(92), ఆరో టోర్నీలో లంక(96) అనూహ్యంగా విశ్వవిజేతలుగా నిలిచాయి. ఆలస్యంగా క్రికెట్‌లోకి అడుగుపెట్టి 1999 ప్రపంచకప్‌కు తొలిసారి అర్హత సాధించిన బంగ్లాదేశ్ పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంది. చూస్తుండగానే వారి ముందే ఆరు ప్రపంచకప్‌లు గడిచిపోయాయి. కానీ ఆ జట్టు ఇప్పటికీ సెమీస్ గండం దాటలేదు. 2015లో క్వార్టర్స్, 2007లో సూపర్-8 మినహా మిగతా నాలుగుసార్లు గ్రూప్ దశలోనే చతికిలపడింది. ఈసారి కాస్త బలంగానే కనిపించినా చివర్లో మాత్రం పాత కథే మళ్లీ వెక్కిరించింది.
అన్నీ ఉన్నా..
– చిన్న జట్టు అనుకున్న బంగ్లాదేశ్ క్రమంగా ఆ ముద్రను చెరిపేసుకుంటూ ప్రతి ప్రపంచకప్‌లోనూ మెరుగైన జట్టుతోనే బరిలోకి దిగుతూ వచ్చింది. టోర్నీకో పెద్ద జట్లకు షాక్ ఇవ్వటం ఆనవాయితీగా మార్చుకుంది. ఈ సారి ఆ జాబితాలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌కు చోటు దక్కింది.
– ఓపెనర్లు కొన్ని మ్యాచ్‌ల్లో మంచి ఆరంభాలివ్వగా.. మిడిలార్డర్ అద్భుతంగా ఆకట్టుకుంది. షకిబ్, ముష్ఫికర్, లిటన్‌దాస్, మహ్మదుల్లా చాలా మ్యాచ్‌ల్లో గొప్పగా పోరాడారు.
– బౌలింగ్ లైనప్ కూడా బలంగానే ఉంది. ముస్తాఫిజుర్, సైపుద్దీన్, మెసాదిక్, మొర్తజా, రూబెల్, మెహదీ రూపంలో నాణ్యమైన బౌలింగ్ వనరులు బంగ్లా సొంతం.
– అన్ని రంగాల్లో మెరుగ్గా కనిపిస్తున్నా.. కీలక సమయంలో తడబాటుకు గురి కావడమే ప్రతికూలాంశం.
– భారీ లక్ష్యాలను సైతం ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా ఆడుతూ పాడుతూ ఛేదించింది. కానీ అనవసరపు షాట్ల ఎంపికే వారి పాలిట శాపంగా మరింది. ఫలితంగా దాదాపు గెలుపు దాకా వెళ్లిన మ్యాచ్‌లు చాలా వరకూ చేజారాయి.
– మొత్తంగా ప్రపంచకప్‌లో ఈ జట్టు 40 మ్యాచ్‌లాడి 14 విజయాలు, 25 పరాజయాలు (ఒక దాంట్లో ఫలితం తేలలేదు) నమోదు చేసింది.
తొలి మ్యాచ్ ఓటమితో..
1999లో తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన బంగ్లాదేశ్ గ్రూప్-బిలో న్యూజిలాండ్‌తో ఆరంభం మ్యాచ్‌లోనే ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లాడి రెండు(పాకిస్థాన్, స్కాట్లాండ్) విజయాలు సాధించగా, మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. ఫలితంగా పాయింట్లపట్టికలో ఐదో స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి టోర్నీలోనే పాకిస్థాన్‌ను ఓడించి షాక్ ఇచ్చింది. |
విజయం లేకుండానే.. 2003 దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచకప్‌లో విజయం లేకుండానే శూన్యహస్తాలతో వెనుదిరిగింది. ఫూల్-బిలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ ఐదింట ఓడగా, వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. |
టీమిండియాకు షాక్.. 2007లో కరీబియన్ దీవుల్లో జరిగిన ఈ ప్రపంచకప్‌లో గ్రూప్-బిలో శ్రీలంక, భారత్, బెర్ముడాతో కలిసి బంగ్లాదేశ్ చోటు దక్కించుకుంది. తొలి మ్యాచ్‌లోనే టీమిండియాకు ఊహించని షాక్ ఇచ్చింది. ద్రవిడ్ నేతృత్వంలోని భారత్‌ను 191 పరుగులకే కట్టడి చేసి, లక్ష్యాన్ని ఛేదించి ఐదు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది. గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌ల్లో రెండింట విజయాలతో సూపర్-8లోకి అర్హత సాధించింది. అప్పటికి ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం విశేషం. తర్వాత సూపర్-8లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట ఓటమి చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. |
ఇంగ్లాండ్‌కు పంచ్.. 2011 ప్రపంచకప్‌నకు భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. గ్రూప్-బిలో ఉన్న బంగ్లా 6 మ్యాచ్‌ల్లో 3 మాత్రమే విజయం సాధించి టోర్నీ నుంచి ఒట్టిచేతులతోనే వైదొలిగింది. కానీ గ్రూప్ దశలో ఇంగ్లాండ్‌పై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి మరో అతి పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. |
క్వార్టర్స్‌లోకి గొప్పగా..
2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. గ్రూప్ దశలో ఆరు మ్యాచ్‌ల్లో 3 విజయాలతో క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. ఈ సారి కూడా గ్రూప్ దశలో ఇంగ్లాండ్‌ను ఓడించి టోర్నీ నుంచి ఇంటికి పంపింది. కానీ క్వార్టర్స్‌లో మాత్రం భారత్ చేతిలో 109 పరుగుల భారీ తేడాతో ఓటమితో ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. |
షకిబ్ మాయ చేసినా.. 2019లో ఇంగ్లాండ్ వేదికగా రౌండ్‌రాబిన్ పద్ధతిలో జరిగిన ఈ మెగా టోర్నీలో 9 మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ మూడు విజయాలు మాత్రమే సాధించింది. తొలి మ్యాచ్‌లో సఫారీలపై 21 పరుగుల తేడాతో విజయం సాధించి ప్రపంచకప్ వేటను ఘనంగా ఆరంభించింది. కానీ తర్వాత వరుస ఓటములు తప్పలేదు. మధ్యలో విండీస్, అఫ్గాన్‌పై విజయాలు పలకరించినా ఎప్పటిలాగే చివర్లో బోల్తా పడింది. కానీ గత టోర్నీలతో పోల్చుకుంటే ఈ సారి బంగ్లాదేశ్ మంచి ప్రదర్శనే చేసింది. సీనియర్ ఆటగాడు షకిబ్ అల్ హసన్ బ్యాటింగ్‌లో వెన్నెముకగా నిలిచాడు. కొన్ని మ్యాచ్‌ల్లో 300లకు పైగా లక్ష్యాలను కూడా బంగ్లా ఛేదించగల్గిందంటే అదంతా షకిబ్ వల్లే. మిడిలార్డర్‌లో ప్రతి మ్యాచ్‌లో సహచర బ్యాట్స్‌మెన్‌తో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అతడు క్రీజులో ఉన్నంతసేపూ చాలా మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ దాదాపు గెలిచినట్లే అన్నంత భరోసా కల్పించాడు. బంతితోనూ కట్టడి చేశాడు. అతడితో పాటు ముష్ఫికర్ రహీమ్, ముస్తాఫిజుర్ కూడా రాణించినా ఫలితం మాత్రం ఎలాంటి మార్పూ లేదు. తర్వాతి టోర్నీలోనైనా బంగ్లా తలరాత మారుతుందో లేదో చూడాలి. |
– ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం