ఇప్పుడంతా బఫేల రాజ్యమే.

0
43

సహపంక్తి భోజనం.. దీని ‘రుచి’ ఈ రోజుల్లో మాటలకే పరిమితం. బంతి భోజనాలు ఎప్పుడో పోయాయి. ఇప్పుడంతా బఫేల రాజ్యమే. పెళ్లిళ్లు.. మరే విందైనా ప్లేటు పట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ ఆరగిస్తున్నాం. ఇది ఫ్యాషనో.. మరేం పోకడో గానీ ఇలా తినడాన్ని వెంటనే మానుకుంటే మంచిది. ఎందుకంటే.. నిలబడి తింటే ఆరోగ్యానికి ఒకింత ప్రమాదమేనంటున్నారు శాస్త్రవేత్తలు. నిల్చుని తినడం వల్ల శరీరమ్మీద ఒత్తిడి పెరిగిపోతుందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఫ్లోరిడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదే కూర్చొని తినడం వల్ల భోజనం రుచిగా కూడా అనిపిస్తుందని చెబుతున్నారు.

తమ అధ్యయనంలో భాగంగా 350 మందిపై పరిశోధన చేసి ఈ విషయాన్ని గుర్తించారు. ‘నిల్చుని భోజనం చేసేప్పుడు శరీరంలోని కింది భాగాల నుంచి పైభాగాల వరకు రక్తం సరఫరా కావాల్సి ఉంటుంది. పై భాగాల వరకు రక్త సరఫరా కావడం కోసం గుండె పంపు చేయాల్సిన వేగం పెరుగుతుంది. తద్వారా గుండె స్పందన రేటు పెరిగి, శరీరంపై ఒత్తిడి పడుతుంది.’ అని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే నిల్చుని తినడం వల్ల రుచికి సంబంధించిన కణాలు సరిగ్గా పనిచేయవని, తద్వారా భోజనం అంత రుచిగా అనిపించదని పేర్కొన్నారు. పెద్దల మాట గుర్తొస్తోంది కదూ! సావధానంగా కూర్చుని తినడం వల్ల పొట్టలోకి ఓ ముద్ద ఎక్కువే దిగుతుందని!