ఉన్నావ్ కేసుపై పోలీసుల దర్యాప్తు .

0
61

బారాబంకీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ పాఠశాలలో పోలీసు అధికారులు మహిళల భద్రతపై ప్రసంగిస్తుండగా ఓ విద్యార్థిని నుంచి ఎదురైన ప్రశ్న వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది.  ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఉన్నావ్ ఘటన అత్యాచార బాధితురాలి కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్న తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దాని గురించి ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు పోలీసులు ఖంగుతిన్నారు. వివరాల్లోకి వెళితే..

పోలీస్‌ సెక్యూరిటీ వీక్‌లో భాగంగా యూపీలోని బారాబంకీ పోలీసులు వివిధ పాఠశాలలను సందర్శిస్తున్నారు. అలాగే ఆనంద్ భవన్‌ పాఠశాలకు వెళ్లారు. అక్కడ 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్న ఉన్నతాధికారిని ఇబ్బందికి గురిచేసింది. అడిషనల్ సూపరిడెంట్ ఆఫ్ పోలీస్‌ ఎస్‌ గౌతమ్‌ మహిళల భద్రతపై విద్యార్థులకు సూచనలు చేస్తుండగా మునిబా కిద్వాయ్‌ అనే విద్యార్థిని మాట్లాడుతూ..‘జరిగిన అన్యాయాలపై గళమెత్తాలని, ఆందోళన చేయాలని చెప్తున్నారు. మీకు తెలుసు కదా ఓ యువతిపై భాజపా నేత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటీవల ఆమెకు జరిగిన రోడ్డు ప్రమాదం కేవలం ప్రమాదం కాదని అందరికీ తెలుసు. ట్రక్‌ నంబరు కనిపించకుండా నల్లటి రంగు పూశారు. శక్తివంతమైన వ్యక్తికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినా ప్రయోజనం ఉండదు. ఒకవేళ పోలీసులు చర్య తీసుకున్నా ఉపయోగం ఉండదని మాకు తెలుసు. ప్రస్తుతం ఆ యువతి క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మేము ఆ ఘటనకు వ్యతిరేకంగా మాట్లాడినా మీరెలా న్యాయం చేయగలరు? నా రక్షణకు మీరెలా గ్యారంటీ ఇవ్వగలరు?’ అని ఆమె ప్రశ్నించారు. దీంతో గౌతమ్‌ ఖంగుతిన్నారు. ఒక నిమిషం పాటు సాగిన ఆ ప్రశ్నను విద్యార్థిని అడిగిన తీరుపై అక్కడున్న మిగతా విద్యార్థులంతా చప్పట్లతో ప్రశంసించారు.
ఇదిలా ఉండగా, ఉన్నావ్  బాధితురాలి కుటుంబ సభ్యులకు బెదిరింపులు వచ్చాయని, దానిపై వారు అనేక ఫిర్యాదులు చేశారని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. వాటిని పరిశీలిస్తున్నామని తెలిపారు. మరోవైపు ఉన్నావ్ కేసుపై సుప్రీం కోర్టు నేడు విచారణ చేపట్టనుంది.