గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన భారత వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు లద్దాక్‌లోని లేహ్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు సమాచారం. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను మోదీ సర్కార్ ఇటీవలే రద్దు చేసి.. జమ్ముకశ్మీర్, లద్దాక్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీ అక్కడ జాతీయ జెండాను ఎగరవేయనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం పుల్వామా జిల్లా క్రూ ప్రాంతంలో పారా రెజిమెంట్ యూనిట్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధోనీ.. ఈ నెల 10న తన బృందంతో కలిసి లేహ్ వెళ్లనున్నాడని ఓ సైనికాధికారి పేర్కొన్నారు.
‘భారత ఆర్మీకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్. ప్రస్తుతం అతడు విధులు నిర్వర్తిస్తున్న చోట తన బృంద సభ్యులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. వారితో కలిసి ఫుట్‌బాల్, వాలీబాల్ ఆడుతున్నాడు. అలాగే సైనిక బలగాలతో కలిసి ఆర్మీ విధుల్లో పాల్గొంటున్నాడు. ఆగస్టు 15 వరకు ధోనీ తన విధుల్లో కొనసాగుతాడు’ అని అధికారి పేర్కొన్నారు. కాగా స్వాతంత్య్ర దినోత్సవం నాడు జమ్ముకశ్మీర్‌లోని ప్రతి గ్రామంలో భారత త్రివర్ణ పతాకం ఎగురవేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ధోనీ లెహ్‌లో జెండాను ఆవిష్కరించనున్నాడని తెలుస్తోంది.
రెండు నెలల పాటు క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్న ధోనీ గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో పారాచూట్ రెజిమెంట్‌లో తన విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.