మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, పవర్‌ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో 14 రీల్స్ ప్లస్ బేనర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషించారు. యువ సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని అందించారు. సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా టైటిల్‌ను మార్చాలని బోయ సంఘం, వాల్మీకి వర్గం డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ మేరకు చిత్ర యూనిట్ టైటిల్‌ను ‘గద్దలకొండ గణేశ్’గా మార్చింది.
అయితే టైటిల్ ‘వాల్మీకి’ అని ప్రకటించినప్పటి నుంచి ఈ టైటిల్‌పై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ‘వాల్మీకి’ టైటిల్ మార్చాలని బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. పిటీషన్‌పై చిత్ర యూనిట్‌కు హైకోర్టు నోటీసులు పంపింది. ఈ నోటీసులకు వివరణ ఇస్తూ చిత్రయూనిట్ చివరి నిమిషంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు టైటిల్ మార్చేది లేదని తెలిపిన చిత్రయూనిట్.. కోర్టుకు వివరణ ఇస్తూ చిత్ర టైటిల్‌ను మారుస్తున్నట్లుగా తెలిపారు. కొత్త టైటిల్‌గా ‘గద్దలకొండ గణేష్’ అని పెడుతున్నట్లుగా చిత్ర నిర్మాతలు, దర్శకుడు హైకోర్టుకు తెలిపారు. సెప్టెంబర్ 20న ఈ చిత్రం ‘గద్దలకొండ గణేష్’ టైటిల్‌తోనే విడుదల కాబోతోంది.