ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం

0
27

ఆర్టీసీ కార్మికుల సమ్మెలో రెండో రోజూ అదే తీవ్రత కనిపించింది. ఆదివారం ఎక్కడి బస్సులక్కడ డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ యాజమాన్యం మాత్రం 51.23%  సొంత బస్సులను నడిపామని, ప్రైవేటుతో కలుపుకొంటే 11 వేలకు పైగా బస్సులను నడిపామని తెలిపింది. ప్రభుత్వ ప్రత్యామ్నాయ చర్యలు కొంత మేర ఊరటనిచ్చాయని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్‌ జంటనగరాల్లో మెట్రో, ఎంఎంటీఎస్‌లతో ప్రయాణికులకు అదనపు సేవలందించామని ప్రభుత్వం పేర్కొంది. కానీ, ఎక్కడా బస్సులు బయటకు రాలేదని, డిపోలకే పరిమితమయ్యాయని కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. 

దసరా పండగకు నగరం పల్లె బాట పట్టింది. పండగ జోష్‌లో ఉన్న జనం బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లకు పరుగులు పెడితే.. అక్కడ వారి కష్టాలు వర్ణనాతీతం. రైల్వే స్టేషన్లలోనైతే నరకం కనిపిస్తోంది. ఆర్టీసీ సమ్మె కారణంగా నగరవాసులు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దాంతో సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. బోగీల్లో కాలు పెట్టడానికి కూడా చోటు ఉండటం లేదు. ఆర్టీసీ సమ్మెను దృష్టిలో ఉంచుకుని కనీసం తక్కువ దూరంలో ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపాలని, లేదంటే ఉన్న రైళ్లకు అదనపు బోగీలు వేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. రైల్వే స్టేషన్లలో టికెట్‌ బుకింగ్‌, విచారణ కేంద్రాలు పెంచకపోవడంతో రైళ్ల రాకపోకల సమాచారం తెలియక ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.