స్నేహం కోసం మొసలితో పోరాటం..

0
33

జింబాబ్వేకి చెందిన 11ఏళ్ల ఓ బాలిక అత్యంత సాహసోపేతంగా 9ఏళ్ల తన తోటి స్నేహితురాలి ప్రాణాలు కాపాడింది. స్నేహితులంతా కలిసి సరదాగా స్విమ్మింగ్ కోసం వెళ్లిన సమయంలో.. ఓ మొసలి అందులో ఓ చిన్నారిని అమాంతం నీళ్లలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే ఆ బాలిక స్నేహితురాలైన మరో బాలిక అత్యంత ధైర్య సాహసాలతో మొసలితో పోరాడింది. మొసలి కళ్లల్లో వేళ్లతో పొడిచి.. అది నీళ్లలోకి పారిపోయేలా చేసింది.ప్రాణాలకు తెగించి ఆ బాలిక ప్రదర్శించిన ధైర్య సాహసాలు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. హరారే సమీపంలోని సిండరెలా అనే గ్రామంలో లతోయా మువాని(9), ఆమె స్నేహితురాలు రెబెకా(11) సహా మరికొందరితో కలిసి ఒక చెరువులోకి సరదాగా స్విమ్మింగ్‌కి వెళ్లింది. అయితే స్విమ్మింగ్ చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి.. ఓ మొసలి హఠాత్తుగా మువానిపై దాడి చేసింది. మువానిని నోట కరిచి నీటిలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో మొసలి పట్టు నుంచి తప్పించుకునేందుకు ఆమె గిలగిలా కొట్టుకోవడం మొదలుపెట్టింది.మువానిని ముసలి లాక్కెళ్తుండటం గమనించిన రెబెకా.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్క ఉదుటన దాని వీపుపై దూకింది. ఆపై తన చేతివేళ్లతో దాని కంట్లో పొడవడం మొదలుపెట్టింది. మొసలి విడిచిపెట్టేంతవరకు అలా చేస్తూనే ఉంది. రెబెకా దెబ్బకు మొసలి ఆ చిన్నారిని విడిచి నీళ్లలోకి పారిపోయింది.

అక్కడున్నవారిలో తానే అందరికంటే పెద్దదాని అని.. తోటి స్నేహితురాలిని లాక్కెళ్తుంటే మరో ఆలోచన లేకుండా దానిపై దూకేశానని తెలిపింది. అదృష్టవశాత్తు రెబెకాకు ఎలాంటి గాయాలు కాలేదు. స్వల్ప గాయాలైన మువాని ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటన గురించి తెలిశాక.. ప్రాణాలకు తెగించి మువానిని కాపాడిన రెబెకా ధైర్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.