తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె విషయంలో తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్. సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్… ఇందుకోసం పలు రూట్లను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాలని డిసైడయ్యారు. ఈ మేరకు కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు… 11న వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే రూట్ల ప్రైవేటీకరణపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అమలవుతుందా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఏపీఎస్ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని కేంద్రం తెలంగాణ హైకోర్టుకు చెప్పడంతో… ఈ అంశంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అమలుకావడంపై సస్పెన్స్ నెలకొంది. దీనిపై కేసీఆర్ సైతం తన సమీక్షలో స్పందించినట్టు తెలుస్తోంది. కేంద్రం వాదనపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.