మోదీ సర్కార్ మరో కొత్త నోటు మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్తం కొత్త రూ.500, రూ.2,000 నోట్లను వ్యవస్థలో చెలామణిలోకి తీసుకువచ్చింది. తర్వాత కొత్త రూ.200 నోట్లు, కొత్త రూ.100 నోట్లు, కొత్త రూ.50 నోట్లు కూడా మార్కెట్‌లోకి వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త రూపాయి నోటు తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన ప్రింటింగ్ ఆఫ్ వన్ రూపీ కరెన్సీ నోట్స్ రూల్స్ 2020ను తాజాగా నోటిఫై చేసింది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దేశంలో కరెన్సీ నోట్లను కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ముద్రిస్తుంది. కానీ ఈ కొత్త రూపాయి నోట్లను మాత్రం కేంద్ర ఆర్థిక శాఖ ప్రింట్ చేస్తుంది. ఆర్‌బీఐ ముద్రించే నోట్లపై మనం ఆర్‌బీఐ గవర్నర్ సంతకాన్ని గమనించొచ్చు. కానీ ఆర్థిక శాఖ ముద్రించే రూపాయి నోటుపై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సెక్రటరీ సంతకం ఉంటుంది.