ముక్కంటి ఆలయాలన్నీ ముక్తకంఠంతో మార్మోగిపోయే సందర్భం వచ్చేసింది..

0
93

శివోహం అంటూ భక్త జనకోటి శివనామస్మరణలో ఊగిపోయే సమయం ఆసన్నమైంది.. మహా శివరాత్రి పర్వదినానికి వేళైంది. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్ధశి రోజు వచ్చే మహా శివరాత్రి.. శివునికి అత్యంత ఇష్టమైనది. సృష్టి, స్థితి, లయల్లో.. లయకారకుడు శివుడు. అలాగని ఆయన శక్తికి పరిమితి లేదు. శివుడి ఆజ్ఞ లేనిదే చిన్న చీమైనా కుట్టదన్న సామెత ఉంది. అలా శివుడు సర్వ శక్తి సంపన్నుడై లింగాకారంలో ఆవిర్భవించిన రోజును మహాశివరాత్రి అంటారు. ఇదే రోజు శివుడు, పార్వతిదేవి వివాహం జరిగిందని కూడా అంటారు. ఈ రోజున చాలామంది ఉపవాసం, జాగరణ చేస్తారు. ఇలా చేయడం ఆనవాయితీగా వస్తుంది. రోజంతా ఏం తినకుండా.. రాత్రి కూడా నిద్ర పోకుండా భక్తులు శివుడిని కొలుస్తారు. అయితే, ఈ రోజున శివుడిని ఎలా కొలవాలి. ఎలా పూజ చేయాలి.. తదితర నియమాలు తెలుసుకోవాల్సిందే.

శివుడు అభిషేక ప్రియుడు, ఉపవాసం, జాగరణలను ఎంతగానో ఇష్టపడతాడు. నిత్యం మంచుకొండల్లోనే ఉండే ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడతారు. అందుకే నిత్యం ఆయన్ను నీటితో అభిషేకిస్తే మంచిదని చెబుతారు. ముక్కంటి కంఠంలో కాలకూట విషం ఉంది కాబట్టి.. దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుందని, చల్లని నీటితో అభిషేకం చేయడం వల్ల ఆయన శరీరం చల్లగా మారుతుందని చెబుతుంటారు. మహా శివరాత్రి రోజున ఆయనకు అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటించాలి. నేలపై పడుకోవడం, సాత్విక ఆహారం తీసుకోవడం, ఒక్కపూట భోజనం, శారీరక, మానసికంగా శుద్ధిగా ఉండాలి. కోపతాపాలు, ఇతరులు నిందించడం వంటివి చేయనే కూడదు.