అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పనున్నారా? ఆర్థిక మాంద్య ప్రభావం ఉన్నా నిరుద్యోగాన్ని తగ్గించి, ఉపాధిని కల్పించే దిశగా మరిన్ని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఈ నెల 6వ తేదీన బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా రెండు పథకాలను అందుబాటులోకి తేవాలని సీఎం కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆపద్భందు పేరుతో.. ఐదుగురు ఎంబీసీ నిరుద్యోగ యువకులకు ఒకటి చొప్పున అంబులెన్స్‌ను అందజేయనున్నట్లు సమాచారం. అంబులెన్సుల నిర్వహణ బాధ్యతలను వారికి అప్పగించి, ఆర్థికంగా చేయూతనివ్వాలన్న ప్రధాన లక్ష్యంతోనే దీన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక.. మహిళలకు కుట్టు మిషన్లు అందజేయనున్నట్లు సమాచారం. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పది వేల మంది నిరుద్యోగ మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. ఈ పథకాలపై ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్ స్పష్టత కూడా ఇచ్చారు. ఈ రెండు పథకాలే కాకుండా మరిన్ని పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.