ప్లాస్టిక్ భూతం

0
45

కాలం మారుతున్న కొద్దీ సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్రజల రోజువారి జీవితం ప్లాస్టిక్‌మయంగా మారింది. ఏది తినాలన్నా, ఏ పని చేయాలన్నా ప్లాస్టిక్‌ లేకుండా దాదాపు అసాధ్యమనే పరిస్థితి తలెత్తింది. కూరగాయల మార్కెట్‌ మొదలుకొని పెద్ద షాపింగ్‌ మాల్‌ వరకూ ఏ వస్తువు తీసుకున్నా ఓ ప్లాస్టిక్‌ కవర్‌లో వేసి ఇస్తున్నారు. కర్రీ పాయింట్లలో అయితే వేడి సాంబారు, అన్నం, కూరలు అన్నింటినీ ప్లాస్టిక్‌ కవర్లలో కట్టి ఇస్తున్నారు. ఏ వేడుకయినా ఆహార పదార్థాల కోసం కంచాలు, టీ గ్లాసులు, నీళ్ల
గ్లాసులు, సాంబారు గిన్నెలు అన్నీ ప్లాస్టిక్‌వే వాడుతున్నారు. ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణానికి అనర్థమని ఏళ్లుగా ప్రభుత్వాలు, పర్యావరణ ప్రియులు చెబుతున్నా.. ప్రజలకు ఎక్కడం లేదు. నిజానికి ప్లాస్టిక్‌ వాడకం వల్ల పరోక్షంగా కాదు.. ప్రత్యక్షంగానే ఆరోగ్యానికి హాని కలుగుతోంది.

బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ సూచించిన విధంగా నాణ్యతా ప్రమాణాలతో తయారు చేసిన ప్లాస్టిక్‌ వస్తువు అయితే కొంతమేరకు ఫరవాలేదు. ఈ వస్తువుల్లో హానికారక రసాయనాలు తక్కువ మోతాదులో ఉంటాయి. వీటి కింది
భాగంలో ఇది ఆహార పదార్థాల కోసమే తయారుచేసినది అని చెబుతూ బీఐఎస్‌ ధ్రువీకరించిన ముద్రణ ఉంటుంది. ఇక ప్లాస్టిక్‌ చేతి సంచుల్లో కనీసం 50 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న సంచులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే విపణిలో ఈ ఆదేశాలు అమలు కావడంలేదు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా థియేటర్లు, షాపింగ్‌
మాల్స్‌లో కొన్ని ఊరుపేరు లేని కంపెనీల నీళ్ల సీసాలను కూడా విక్రయిస్తున్నారు.

ప్లాస్టిక్‌ వస్తువుల వల్ల కలిగే అనర్థాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు కొన్ని రకాల ప్లాస్టిక్‌ ఉత్పత్తులను నిషేధించగా, కర్ణాటక కూడా అదే బాటలో కసరత్తు చేస్తోంది.
కేరళలో శబరిమల తదితర కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా నిషేధాన్ని విధించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం.. తెలంగాణలోనూ కొన్ని రకాల ప్లాస్టిక్‌ వస్తువులపై పూర్తిగా నిషేధం విధించనున్నారు. త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తొలి తప్పుకు ఐదువేల జరిమానా, రెండో తప్పుకు 10వేల రూపాయల జరిమానా, మూడోసారి కూడా తప్పు
చేస్తే 25వేల రూపాయల జరిమానా, మూడు నెలల జైలుశిక్ష విధించేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్లాస్టిక్‌ వాడకం వల్ల మనకు తెలియకుండానే విషతుల్యాలు శరీరంలోకి చేరిపోతున్నాయి. వేడివేడిగా ఉండే ఆహార పదార్థాలను ప్లాస్టిక్‌ వస్తువుల్లో వాడడం వల్ల హానికారకాలు విడుదలై, శరీరంలో ప్రమాదకరమైన మార్పులకు కారణం అవుతున్నాయి. శరీరంలోని సహజసిద్ధ హార్మోన్ల సమతౌల్యతను దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా పిల్లల జీవన ప్రమాణాలపై దుష్ప్రభావం చూపి..
జీవిత కాలాన్ని తగ్గిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ప్లాస్టిక్‌ సంచుల్లో, డబ్బాల్లో టీ లేదా ఇతర వేడి ఆహార పదార్థాలను ఉంచినప్పుడు.. వాటిలోంచి విషతుల్య రసాయనాలు వెలువడుతాయి. ముఖ్యంగా కాలేయ క్యాన్సర్‌ రావడానికి కారణమవుతుంది. చాలామంది నీళ్ల సీసాలను కార్లలో పెట్టి మరిచిపోతుంటారు. వీటినుంచి ప్రమాదకరమైన ప్లాస్టిక్‌ పరమాణువులు విడుదలవుతాయి. ఆ నీటిని తాగినప్పుడు విషతుల్యాలు మన శరీరంలోకి చేరుతున్నాయి.